నిధుల్లేవు.. పనుల్లేవు..!
కరీంనగర్‌లో రెండేళ్లలో అభివృద్ధి శూన్యం
కేంద్రం–రాష్ట్రం నిర్లక్ష్యం వల్ల నగరానికి నష్టం
బీఆర్ఎస్ హయాంలోనే అసలైన అభివృద్ధి
హామీలు అమలు కాక ప్రజల్లో అసంతృప్తి
మేయర్ పీఠం మళ్లీ బీఆర్ఎస్ ఖాతాలోనే
కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్
కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగర అభివృద్ధికి గణనీయమైన నిధులు తీసుకురాలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో చెప్పుకునే పనులన్నీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన నిధులతోనే జరిగాయని, వాటినే ఇతర పార్టీలు తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని 9వ డివిజన్‌లో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో నగరానికి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. ప్రస్తుతం కొత్తగా ఒక్క రూపాయి కూడా తీసుకురాని పాలకులు, పాత పనులనే తమవిగా చెప్పుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్–బీజేపీ పాలనపై విమర్శలు
కాంగ్రెస్, బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు వెనుకబాటుకు గురైందని గంగుల వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో రాష్ట్రంతో పాటు కరీంనగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటి? తీసుకొచ్చిన నిధులు ఎన్ని? అన్నదానిపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకావడం లేదని గంగుల కమలాకర్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించి పాలన సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన కాలంలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నను లేవనెత్తారు. పాలకుల వైఫల్యాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.
మేయర్ పీఠంపై ధీమా
కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి స్పష్టమైన విజన్ బీఆర్ఎస్‌కే ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, డివిజన్ అభ్యర్థి జంగిలి లత – ఐలెందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.


