మేడారం పోదాం పదా..! చలో..చలో..
అన్ని దారులూ వనదేవత వైపే
వాహనాలతో కిక్కిరిసిపోతున్న ములుగు హైవే
నలు దిశల నుంచి తరలివస్తున్న భక్తజనం
సారలమ్మ ఆగమనంతో అధికారికంగా ఆరంభం కానున్న జాతర
ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం అప్రమత్తం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర – 2026 నేటి సారలమ్మ ఆగమనంతో అధికారికంగా ప్రారంభం కానుండటంతో భక్తులు భారీ సంఖ్యలో మేడారం బాట పట్టారు. నేటి నుంచే ప్రధాన ఘట్టాలు మొదలవుతుండటంతో ములుగు జిల్లా పరిధిలోని రహదారులన్నీ ఒక్కసారిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచే రాక పెరిగి, రాత్రి వేళ రద్దీ మరింత పెరిగింది.
మేడారం జాతర ప్రత్యేకతను చాటుతూ సంప్రదాయ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, పెద్ద పెద్ద డీసీఎంలు, లారీల వరకు అన్నిరకాల వాహనాల్లో భక్తులు మేడారం వైపు కదులుతున్నారు. కొందరు భక్తులు కాలినడకన, మరికొందరు బృందాలుగా ఆడుతూ పాడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ దృశ్యాలు జాతర వైభవాన్ని ముందుగానే ప్రతిబింబిస్తున్నాయి.

రహదారులపై రద్దీ – ట్రాఫిక్ నియంత్రణ
భక్తుల రాక పెరగడంతో ములుగు–తాడ్వాయి, వరంగల్–ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం, పస్రా, నార్లాపూర్ మార్గాల్లో వాహనాల రద్దీ అధికంగా కనిపిస్తోంది. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాలను దశలవారీగా మేడారం వైపు పంపిస్తూ రహదారి నియంత్రణ చేపడుతున్నారు. సమ్మక్క–సారలమ్మలపై అపారమైన విశ్వాసంతో భక్తులు మేడారం వైపు అడుగులు వేస్తున్నారు. నేటి సారలమ్మ ఆగమనంతో జాతర వాతావరణం మరింత ఉత్సాహంగా మారనుంది. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముండటంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి.


