గేట్‌వే ఆఫ్ మేడారం
మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికే
మేడారం యాత్రకు తొలి మెట్టు గట్టమ్మ సన్నిధి
ఆదివాసి విశ్వాసాల గుండెచప్పుడు
సమ్మక్క–సారలమ్మలకు ఆడపడుచు
జాతర వేళ కిటకిటలాడుతున్న జాకారం గట్టమ్మ ఆలయం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వెళ్లే ప్రతి భక్తుడి ప్రయాణం ఒకే చోట మొదలవుతుంది. అదే… మొదటి మొక్కల తల్లి గట్టమ్మ సన్నిధి. మేడారం వెళ్లే ముందు గట్టమ్మకు మొక్కు చెల్లించడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు… అది ఆదివాసి విశ్వాసాల గుండెచప్పుడు. సమ్మక్క–సారలమ్మలకు ఆడపడుచుగా గట్టమ్మను ఆదివాసులు భావిస్తారు. అందుకే వనదేవతల దర్శనానికి ముందు “ముందు ఆడపడుచిని దర్శించుకోవాలి” అనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతోంది. భక్తులు తమ కోరికలు, మొక్కులు ముందుగా గట్టమ్మకే చెప్పుకుంటారు. ఆమె ఆశీర్వాదం లభిస్తేనే మేడారంలో వనదేవతల దర్శనం ఫలప్రదమవుతుందన్న విశ్వాసం బలంగా ఉంది.

గేట్‌వే ఆఫ్ మేడారం
మేడారం కేంద్రంగా జరిగే మహాజాతరకు వెళ్లే మార్గాల్లో చుట్టుపక్కల ఆరు గట్టమ్మ సన్నిధులు వెలసి ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ మార్గాల గుండా మేడారం చేరుకునే భక్తులంతా తమ దారిలో ఉన్న గట్టమ్మ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుని అక్కడి నుంచే మేడారానికి అడుగులు వేస్తారు. ఈ కారణంగానే గట్టమ్మను “గేట్‌వే ఆఫ్ మేడారం”గా పిలుస్తారు. మేడారం యాత్రలో మొదటి కొబ్బరి, మొదటి మొక్కు, మొదటి ప్రార్థన అన్నీ గట్టమ్మకే. భక్తులు క్షేమంగా వెళ్లి రావాలి, కోరికలు తీరాలి, వనదేవతల కటాక్షం ఉండాలంటూ గట్టమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మొక్కుతోనే మేడారం ప్రయాణం ప్రారంభమవుతుంది.
జాతర వేళ గట్టమ్మ సన్నిధి సందడి
నేటి నుంచి మేడారం జాతర మొదలవుతున్న నేపథ్యంలో గట్టమ్మ ఆలయాల వద్ద భక్తుల సందడి పెరిగింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు గట్టమ్మ వద్ద వాహనాలను ఆపి మొక్కులు చెల్లించుకుని మళ్లీ మేడారానికి పయనమవుతున్నారు. దీంతో ఆలయాల పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
గట్టమ్మ కేవలం ఒక దేవత మాత్రమే కాదు… ఆమె ఆదివాసి సంస్కృతికి ప్రతీక, మహిళా దేవతా శక్తికి సంకేతం, మేడారం జాతరకు తొలి మెట్టు. గట్టమ్మ దర్శనం లేకుండా మేడారం యాత్ర పూర్తికాదని, మొదటి మొక్కు లేకుండా ప్రయాణం మొదలుకాదని భక్తులు విశ్వసిస్తారు.


