నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్ల పరిశీలన
ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
బందోబస్తు కట్టుదిట్టం: కలెక్టర్–సీపీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లు, చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులు, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల పరిధిలోని తలా 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. డివిజన్ల వారీగా నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులు వచ్చే మార్గం–వెళ్లే మార్గం వేరువేరుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.


