పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మేయర్ సుధారాణి
హార్టికల్చర్ అధికారులతో సమీక్ష సమావేశం
కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలోని పార్కుల్లో పచ్చదనం మరింత పెంచే దిశగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టనుందని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఈ మేరకు మంగళవారం హార్టికల్చర్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నగర పరిధిలోని పార్కులు, ముఖ్యంగా గ్రాండ్ ఎంట్రెన్స్ (ముఖ ద్వారాలు) ప్రాంతాల్లో గ్రీనరీ ఏర్పాటు చేసి నిరంతరం పచ్చదనం కనిపించేలా నిర్వహణ కొనసాగాలని మేయర్ సూచించారు. రాబోయే వన మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని నర్సరీల్లో అవసరమైన మొక్కలను ముందుగానే పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బల్దియా నిర్వహిస్తున్న నర్సరీల్లో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి వాస్తవ పరిస్థితిని అంచనా వేసి మొక్కల పెంపకంపై దృష్టి సారిస్తామని చెప్పారు. డబ్ల్యుఆర్ఐ రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా సుందరయ్య నగర్, క్రిస్టియన్ కాలనీ ప్రాంతాల పార్కులు, హన్మకొండలోని బాలసముద్రం చిల్డ్రెన్స్ పార్క్‌లో ఇంజినీరింగ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అదే తరహాలో గ్రీనరీ కోణంలో కూడా ఇంజినీరింగ్ అధికారుల సహకారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిహెచ్ రమేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, హార్టికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


