వరంగల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు
డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పునరుద్ధరణపై హర్షం
స్పష్టత ఇవ్వకపోతే మళ్లీ ఉద్యమం : టీయూడబ్ల్యూజే 143 (ఐజేయూ) నేతలు
కాకతీయ, వరంగల్ : డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, డెస్క్ జర్నలిస్టుల నేతలు శంకర్ రావు శెంకేసి, వర్దెల్లి లింగయ్య, విద్యాసాగర్, సోమనర్సయ్య, ఐజేయూ రాష్ట్ర నాయకుడు గాడిపల్లి మధు మాట్లాడుతూ జర్నలిస్టులను మీడియా కార్డులు, అక్రిడిటేషన్ కార్డుల పేరుతో ప్రభుత్వం విభజించేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. డెస్క్ జర్నలిస్టులకు జరగబోయే అన్యాయంపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టామని తెలిపారు. ఆ పోరాటానికి స్పందించిన ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. అయితే జిల్లాల వారీగా, యూనిట్‌ల వారీగా ఎన్ని కార్డులు జారీ చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విధంగానే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, లేదంటే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143, ఐజేయూ నాయకులు, ప్రెస్ క్లబ్ కోశాధికారి బోల్ల అమర్, ఉపాధ్యక్షులు బొడిగె శ్రీనివాస్, అల్లం రాజేశ్ వర్మ, జాయింట్ సెక్రటరీ బూర్ల నరేందర్‌తో పాటు పెద్ద సంఖ్యలో డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.


