ఎస్‌బీఐటీ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు
ఏఐ–డిజిటల్ విద్య పైలట్ ప్రాజెక్ట్‌లో విశేష సేవలు
34 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం
కాకతీయ, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ఆధారిత డిజిటల్ విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పైలట్ ప్రాజెక్ట్‌లో విశేషంగా సేవలందించిన ఎస్‌బీఐటీ విద్యార్థులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేకంగా ప్రశంసించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాలకు చెందిన 34 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మంగళవారం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక విద్యను అందించడంతో పాటు, కళాశాల విద్యార్థులకు స్కేల్‌అప్ ఇంటర్న్‌షిప్ రూపంలో ఇరువురికీ ఉపయోగకరంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు తెలిపారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ సూచనల మేరకు ఖమ్మం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను కళాశాలకు అప్పగించగా, ప్రతి పాఠశాలకు ఎనిమిది మంది చొప్పున విద్యార్థులను నియమించి నెలరోజుల పాటు ఏఐ, ఈ-లెర్నింగ్, డిజిటల్ టూల్స్‌పై శిక్షణలు అందించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు “అన్న–అక్క”లుగా మెంటర్ల పాత్ర పోషిస్తూ అద్భుత ప్రతిభ కనబరిచారని, వారి పనితీరుతో కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు.


