మద్ది మేడారం జాతరపై పోలీసుల సమీక్ష
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
బందోబస్తులో అలసత్వం చేయొద్దు : సీఐ సాయి రమణ
కాకతీయ, నల్లబెల్లి : మద్ది మేడారం–టేకుల మేడారం జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామీణ సీఐ సాయి రమణ పోలీసు సిబ్బందికి సూచించారు. జాతర ఏర్పాట్లపై మద్ది మేడారంలో నిర్వహించిన పోలీసు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలని, భద్రతా ఏర్పాట్లు, గస్తీ వ్యవస్థను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ఉండరాదని స్పష్టం చేశారు. జాతర ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్సై వి. గోవర్ధన్, రెండవ ఎస్సై లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


