చికిత్స పొందుతూ యువకుడు మృతి
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని దుబ్బ తండాకు చెందిన బట్టు మురళి(22)అనే యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మైలారం గ్రామం నుండి దుబ్బ తండకు వెళ్లే మార్గం మధ్యలో కెనాల్ వద్ద మురళి ఈనెల 13వ తేదీ మంగళవారం రోజున రాత్రి 8:30 గంటలకు పురుగుల మందు సేవించాడు.మురళి దేదావత్ సిద్దుకు ఫోన్ చేసి పురుగుల మందు తాగానని చెప్పగా వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సిద్దు,సూర్య ఇద్దరు కలిసి స్కూటీ పైన మురళిని తొర్రూర్ లోని సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ఐదు రోజులపాటు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించాలని సూచించారు.హుటాహుటిన కుటుంబ సభ్యులు మురళిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4గంటలకు ఎంజీఎం ఆస్పత్రిలో మురళి మృతి చెందాడు.చేతికి అందిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.మృతుడి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


