ఖిలా వరంగల్ కోటలో పర్యాటకుల సందడి
మేడారం జాతరతో పెరిగిన పర్యాటకులు
కాకతీయ, ఖిలావరంగల్ : మేడారం మహాజాతరకు తరలివస్తున్న లక్షలాది భక్తులు జాతరతో పాటు కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలను సందర్శిస్తూ పర్యాటక ఆసక్తి చూపుతున్నారు. జాతరకు వచ్చిన వారు ఓరుగల్లు కోట, వెయ్యి స్థంభాల గుడి, రామప్ప దేవాలయం వంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలను దర్శిస్తున్నారు. అంతేకాక లక్నవరం, కోటగుళ్లు, రుద్రమదేవి మెట్లబావి వంటి ప్రాంతాలకు కూడా సందర్శకులు వెల్లువెత్తుతున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కాకతీయ శిల్పకళా వైభవం, చరిత్రను ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం లభిస్తోంది. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతాల సౌందర్యం, చారిత్రక ప్రాధాన్యంపై ప్రత్యేక ఆకర్షణ చూపుతున్నారు. పర్యాటకుల రాక పెరగడంతో రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి మౌలిక వసతులను అధికారులు మెరుగుపరిచారు.
మేడారం జాతరతో పాటు కాకతీయ వారసత్వ కట్టడాలకు పెరిగిన సందర్శకుల రాక ఈ ప్రాంత పర్యాటకానికి మరింత ఊతమిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


