క్యాడర్ ఓకే.. నేతలే కరెక్ట్ లేరు
వరంగల్‌లో బీజేపీకి అత్తెసరు నాయకత్వం..
హన్మకొండలో ఆయన పేరుకే పెబ్బ.. పెత్తనమంతా ఇంకా ఆమెదే..!
కొత్తవాళ్లను ఆహ్వానించరు.. పాత తరాన్ని గుర్తించరు..!
అంతా మేమే.. అంతా తామే అన్నట్లుగా రాజకీయ వ్యవహార శైలి
సీనియర్ నేతల్లో పెరుగుతున్న అసహనం..!
మరి రాష్ట్ర నాయకత్వం గుర్తించేది ఎప్పుడు..?!
ఇలా అయితే వరంగల్‌లో పార్టీ ఎదిగేదెప్పుడు..?
క్యాడర్‌లో లోకల్ నాయకత్వంపై గుస్సా..!
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్, హన్మకొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా ఉన్నా, నాయకత్వ లోపాలు మరియు అంతర్గత విభేదాలు పార్టీని వెనక్కి లాగుతున్నాయి. సమన్వయం లేని నేతల రాజకీయంతో కార్యకర్తల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వరంగల్, హన్మకొండ నియోజకవర్గాల్లో కొందరు నేతల ఆధిపత్యం ఎక్కువగా ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. “పేరుకే ఒకరు.. పెత్తనమంతా మరొకరిది” అన్న తరహా రాజకీయ వ్యవహార శైలిపై సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హన్మకొండ జిల్లా పార్టీలో ఇంకా ఆమె చేతుల్లోనే పార్టీ పెత్తనమంతా ఉందంటూ కామెంట్లు వస్తుండటం గమనార్హం. పేరుకే ఆయన పెబ్బ.. పెత్తనమంతా ఇంకా ఆమెదే అంటూ కొంతమంది సీనియర్ లీడర్లు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. నిర్ణయాలు కొద్దిమంది చేతుల్లోనే ఉంటుండటంతో మిగతా నేతలకు కనీస ప్రాధాన్యం ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆరూరి నిష్క్రమణతో..
బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు జిల్లాలో సముచిత స్థానం కల్పించడంలో లోకల్ నాయకత్వం వైఫల్యం చెందిందన్న చర్చ ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది. రాజకీయాల్లో సొంత ఎజెండా ఉండటం సహాజం.. అరూరి రమేష్ కూడా అందుకు భిన్నంగామీ వ్యవహరించలేదు. కానీ పార్టీ ఫస్ట్..పర్సన్ నెక్ట్స్ అన్న బీజేపీ మూల సూత్రాన్ని గుర్తు చేస్తూనే.. కొంతమంది లీడర్లకే ప్రాధాన్యం ఏంటని..! పార్టీలో తాము తప్పా మిగిలిన వారంతా కూడా తాము చెప్పినట్లుగానే నడుచుకోవాలనే పెత్తందారి వైఖరిని ప్రదర్శించడంపై ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర నేతలు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ఇక్కడ తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్న వారు.. ఎన్నికల్లో తమ డివిజన్లలో కూడా కనీస ఓట్లు సాధించలేకపోయారంటూ మండిపడుతున్నారు. అరూరి ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరించారని కొంతమంది బీజేపీ నేతలు విమర్శిస్తుండగా.. చేసేదే రాజకీయం.. పార్టీకి పర్సన్స్ కూడా ముఖ్యమే కదా అంటూ మరికొంతమంది లీడర్లు ఇప్పుడు గట్టి వాదన వినిపిస్తున్నారు. పార్టీలో కొత్తగా ఎవరొచ్చినా తమకు పోటీ అన్నట్లుగా ఓ నలుగురైదుగురు లీడర్లు వ్యవహరిస్తున్న తీరు.. జిల్లాలో పార్టీ ఎదుగుదలకే ఆటంకంగా మారిందన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పార్టీలో అరూరిని కీలకం చేయడంలో స్థానిక నాయకత్వం ఆయన్ను పోటీగా భావించదన్న చర్చా జరుగుతోంది. ఆయన నిష్క్రమణ పార్టీకి రాజకీయంగా గట్టి దెబ్బగా మారిందని, ఆరూరితో పాటు మరికొందరు నేతలు కూడా బయటకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం క్యాడర్‌లో ఆందోళన కలిగిస్తోంది.
పాత–కొత్త మధ్య పెరుగుతున్న గ్యాప్
పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి సరైన ఆహ్వానం లేదని, అదే సమయంలో పాత తరం నేతలను గుర్తించట్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల నియామకాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుండటంతో సీనియర్ నేతల్లో అసహనం మరింత పెరుగుతోంది. ‘అంతా మేమే.. అంతా తామే’ అన్నట్టుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతోంది.
క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు స్థానిక నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప పార్టీ విస్తరణపై దృష్టి లేదన్న అభిప్రాయం బలపడుతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార వ్యూహాలు స్పష్టంగా లేకపోవడం, నేతల మధ్య ఐక్యత కొరవడటం పార్టీకి నష్టం మిగిల్చే సంకేతంగానే క్యాడర్ భావిస్తోంది. మొత్తానికి, వరంగల్ లాంటి కీలక జిల్లాలో బీజేపీకి క్యాడర్ బలం ఉన్నా, నాయకత్వ వైఫల్యాలు పార్టీ ఎదుగుదలకు అడ్డుగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుండటం పార్టీ విస్తరణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణ జరుగుతోంది. ఈ అంతర్గత కుమ్ములాటలను రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు గుర్తించి జోక్యం చేసుకుంటుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. లేదంటే… వరంగల్‌లో పార్టీ ఎదుగుదల ఎప్పుడన్న ప్రశ్న.. ఎప్పటికీ ప్రశ్నగానే ఉండిపోతుందని ఆవేదనతో కూడిన చర్చ బీజేపీ శ్రేణుల్లో జరుగుతుండటం గమనార్హం


