మున్సిపల్ ఎన్నికల నగారా..!
నేడు షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందని అధికారుల ద్వారా విశ్వసనీయ సమాచారం షెడ్యూల్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి రానుంది. షెడ్యూల్ ప్రకటించే ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో తుది చర్చలు జరగనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 15లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అంచనాల ప్రకారం ఫిబ్రవరి 11 లేదా 12న పోలింగ్, 13 లేదా 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు జరగనున్నాయి. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు విడుదలయ్యాయి. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల సిద్ధీకరణతో పాటు ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.


