మేడారం జాతరకు తరలుతున్న భక్తులు
కొత్తగూడెం బస్టాండ్‌లో పెరిగిన రద్దీ
110 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : మేడారం మహాజాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. బుధవారం సారలమ్మ, పగిడిద్ద రాజులు గద్దెల మీదకు చేరుకోనునడంతో వనదేవతలకు స్వాగతం పలికేందుకు.. ఆ మహాఘట్టాన్ని కనులారీ వీక్షించేందుకు భక్తులు తరలివెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో భక్తుల తాకిడి భారీగా నెలకొంది. ముఖ్యంగా ఈ నెల 28, 29, 30 తేదీలకు ప్రాధాన్యం ఉండటంతో తొలిరోజే భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం బాట పట్టారు. భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం బస్టాండ్ నుంచి మేడారం జాతరకు 110 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు డిపో మేనేజర్ డి.ఎం. రాజ్యలక్ష్మి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆధార్ ఆధారంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. భక్తులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో సుఖవంతమైన ప్రయాణం అంటూ విస్తృత ప్రచారం నిర్వహించారు. జాతరకు పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.190 చొప్పున చార్జీలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, భక్తుల దాహార్తి తీర్చేందుకు దుంపల ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ, మంచినీటి పంపిణీ చేపట్టారు.


