ఎంపీ నిధులతో రెండు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు
చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి, ధూల్మిట్ట పాఠశాలలో ప్రారంభించిన చామల
కాకతీయ, చేర్యాల : భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ ఎంపీ నిధులతో చేర్యాల ప్రాంతంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఎంపీ నిధుల నుంచి రూ.1.20 లక్షల వ్యయంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వాటర్ ప్లాంట్‌ను, అలాగే ధూల్మిట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం మరో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. గతంలో చేర్యాల, ధూల్మిట్ట ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కొద్ది నెలల వ్యవధిలోనే స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు అలాగే పాఠశాల విద్యార్థులకు ఈ వాటర్ ప్లాంట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఎంపీ నిధులతో ప్రజావసరాలకు ఉపయోగపడే పనులు చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


