రెపరెపలాడిన మువ్వన్నెల జెండా!
* ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
* సాంస్కృతిక నృత్యాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా జరిగాయి. నాలుగు జిల్లాల కేంద్రాల్లోని పరేడ్ గ్రౌండ్లు, కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. జాతీయ జెండా ఆవిష్కరణలతో వేడుకలు ప్రారంభమై రాజ్యాంగ విలువల స్మరణతో కొనసాగాయి. పోలీస్ గౌరవ వందనాలు, కవాతులు వేడుకలకు గంభీరతను జోడించాయి.
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాదని, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలు, రైతులు, యువతకు లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి, స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఆకట్టుకున్నాయి.
జగిత్యాల, రామగుండం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల్లో ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రతి చోటా జెండా ఆవిష్కరణలు, క్రమశిక్షణతో సాగిన కార్యక్రమాలు, శాఖల ప్రదర్శనలు గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటాయి.


