ఎస్‌బీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని అన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, స్వయంపాలన కోసం 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు ప్రభుత్వాలను ఎన్నుకునే అధికారం లభించిందని తెలిపారు. కళాశాల వైస్ చైర్మన్ కే. శ్రీ చైతన్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. రాజ్‌కుమార్ ‘రిపబ్లిక్’ అంటే ప్రజల చేత, ప్రజల కొరకు నడిచే పాలన అని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


