వరంగల్ నగరం త్రివర్ణ శోభితం
బల్దియా, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణలు
మువ్వన్నెల తోరణాలు, ర్యాలీలతో పండుగ వాతావరణం
కాకతీయ / వరంగల్ : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ మహానగరం సోమవారం త్రివర్ణ శోభతో మెరిసింది. ప్రధాన వీధులు, ప్రభుత్వ–ప్రైవేటు కార్యాలయాలు, యూనియన్ ఆఫీసులు, మహానీయుల విగ్రహాల వద్ద మువ్వన్నెల తోరణాలు ఆకట్టుకున్నాయి. పలు పాఠశాలల విద్యార్థులు దేశభక్తి ర్యాలీలతో ఉత్సాహం నింపారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షల మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంప్యూటర్, లాట్ ఐడీ ఆపరేటర్లకు యూనిఫాంలు పంపిణీ చేశారు. వ్యాపార సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అధ్యక్షుడు జెండా ఎగురవేసి గుమస్తా సంక్షేమ నిధికి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంజీఎం ఆసుపత్రిలోనూ పతాకావిష్కరణలు జరిగాయి. మొత్తం మీద నగరం అంతా గణతంత్ర పండుగ వాతావరణంతో కళకళలాడింది.




