ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బస్సు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కరీంనగర్‌లో విషాద ఘటన
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా మలుపు తిరిగిన స్కూల్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీణవంక మండలం మామిడుపల్లి గ్రామానికి చెందిన మ్యకల గణేష్ (22), మిరియాల సందీప్ రెడ్డి (20) ఈ ప్రమాదంలో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనవరి 26 ఉదయం గణేష్ తన సొంత బైక్‌పై స్పేర్ పార్ట్స్ కొనుగోలు నిమిత్తం కరీంనగర్‌కు బయలుదేరాడు. అతనితో పాటు స్నేహితుడు సందీప్ రెడ్డి బైక్ వెనుక కూర్చున్నాడు. మరో ద్విచక్రవాహనంపై వారి స్నేహితులు కూడా కలిసి ప్రయాణించారు. మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలోని ఓ పాఠశాల సమీపంలో అకస్మాత్తుగా మలుపు తిరిగిన స్కూల్ బస్సు గణేష్ నడుపుతున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేష్, సందీప్ ఇద్దరూ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, గణేష్‌ను 12.35 గంటలకు, సందీప్‌ను 12.40 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సు నంబర్ టీఎస్–02–యూసీ–3211 కాగా, డ్రైవర్ గంధం భాస్కర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.



