ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు సిగ్గుచేటు!
బీజేపీకి చరిత్రపై గౌరవం లేదా?
గాంధీ పేరు యథావిధిగా కొనసాగించాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
మహానీయుల పేరు తొలగింపు ప్రయత్నం సరికాదు : ఇనగాల
కాకతీయ, ఆత్మకూరు: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును మార్చడం బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరయ్యారు. టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రెక్కాడితే కానీ డొక్కా నిండని పేదలకు ఈ పథకం జీవనాధారమని చెప్పారు. అలాంటి చారిత్రాత్మక పథకానికి గాంధీ పేరు తీసివేయడం అనుచితమని, ఇది ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని, అలాంటి మహానీయుల పేరును తొలగించే ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వానికి తగవని మండిపడ్డారు. గాంధీ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ హనుమకొండ ఇంచార్జ్ శ్రీను బాబు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


