ఆటలతోనే ఆరోగ్యానికి బలం
వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్
కాకతీయ, కారెపల్లి : ఆటలు ఆడితేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, క్రీడలతో శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక దృఢత్వం కూడా పెరుగుతుందని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని తోడీతలగూడెం గ్రామంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తోడీతలగూడెం గ్రామ సర్పంచ్ బానోత్ ప్రియాంక కుమార్ ఆధ్వర్యంలో నాలుగు మండలాల స్థాయిలో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీలకు యువత పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్ పోటీల ప్రారంభానికి ముందు ఇటీవల ఎన్నికైన సర్పంచ్ బానోత్ ప్రియాంక కుమార్ దంపతులను మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి నాయకత్వం వహిస్తూ క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్నందుకు ఆయన సర్పంచ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ, నేటి యువత మొబైల్‌ఫోన్లు, వ్యసనాల వైపు ఆకర్షితమవుతున్న తరుణంలో క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఆటలు ఆడడం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా తయారవుతారని తెలిపారు. గ్రామీణ యువత క్రీడలపై ఆసక్తి చూపితే భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో నాయకులు అజ్మీర వీరన్న, భూక్యా రాం కిషోర్, వాంకుడోత్ విజయ్, గుగులోతు హరు, రవి, రాహుల్, సుజాత, కళ్యాణ్, సుధాకర్, థామస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా కొనసాగింది.


