కాకతీయ కథనంతో కదిలిన పార్టీలు!
జాతర ఏర్పాట్లలో నాసిరకం పనులపై బీఆర్ఎస్ ఆగ్రహం
అధికారుల పర్యవేక్షణ కరువేనంటున్న బీజేపీ

కాకతీయ, నల్లబెల్లి : టేకుల మేడారం–మద్ది మేడారం జాతర ఏర్పాట్లలో నాసిరకం పనులు, తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కాకతీయ కథనం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కథనానికి స్పందించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల పార్టీ నాయకులు జాతర ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నల్లబెల్లి మండల పార్టీ నాయకులు టేకుల మేడారం, మద్ది మేడారం ప్రాంతాల్లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైసలు ఫుల్… సౌకర్యాలు నిల్ అన్నట్టుగా పరిస్థితి ఉందని విమర్శించారు. జాతరకు కేవలం రెండు రోజులే మిగిలి ఉండగా తాగునీటి సౌకర్యాలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోర్లు, మోటార్లు ఏర్పాటు చేసినా నీరు రాకపోవడం, ఉపయోగం లేని పనులకు బిల్లులు వేసినట్టుగా కనిపించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రోడ్లు, విద్యుత్, పారిశుద్ధ్య పనులు కూడా పూర్తి కాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. జాతర కోసం మంజూరైన రూ.29.23 లక్షల నిధులు క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఇక బీజేపీ మండల పార్టీ నాయకులు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కాంట్రాక్టర్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కఠిన పర్యవేక్షణతో పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అవకతవకలను వెలుగులోకి తెచ్చిన కాకతీయ పత్రికను బీజేపీ నాయకులు అభినందించారు. సౌకర్యాలు వెంటనే కల్పించకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఇరు పార్టీల నేతలు హెచ్చరించారు.


