ఆత్మకూరు నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులు
కాకతీయ, ఆత్మకూరు : ఆత్మకూరు నుంచి మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు తెలిపారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఈ ప్రత్యేక బస్సులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆత్మకూరు నుంచి మేడారంకు నాన్‌స్టాప్‌గా 25 ప్రత్యేక బస్సులను అర్మూర్ డిపో ద్వారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాతర ప్రారంభం నుంచి ముగిసే వరకు ఈ బస్సులు 24 గంటల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఆత్మకూరు పరిసర గ్రామాల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జ్ఞానేశ్వర్, ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి శ్వేత తదితరులు పాల్గొన్నారు.


