పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం
ప్రజా ప్రభుత్వ పథకాలే ఎన్నికల్లో బలం
మున్సిపాలిటీ విజయానికి ఐక్య కార్యాచరణ
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల : రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ఇన్‌చార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు ప్రధాన బలమని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీకి అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించేందుకు పరకాల పట్టణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు మెచ్చే నాయకులకే కౌన్సిలర్‌గా అవకాశం ఇవ్వాలని సూచించారు. పరకాల పట్టణానికి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస సౌకర్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరకాలను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
ఐక్యతతోనే ఘన విజయం
రానున్న ఎన్నికల్లో వ్యక్తిగత భేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వార్డు స్థాయిలో బలమైన కార్యాచరణతో ప్రజల మద్దతు సమీకరించాలని, ప్రతి కార్యకర్త ఎన్నికల సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టేందుకు పరకాల పట్టణం సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ఇన్‌చార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


