హైలెవల్ వంతెన నిర్మాణమెప్పుడు..?!
ప్రభుత్వాలు మారినా… పాలేరు తిప్పలు తీరవా!
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన హై లెవెల్ వంతెన
ఏడాదిన్నరగా నిలిచిన గ్రామాలకు రాకపోకలు
చుట్టూ తిరిగి జిల్లా సరిహద్దు ప్రయాణం
హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజల డిమాండ్
కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామ సమీపంలోని పాలేరు వాగుపై నిర్మించిన లో లెవెల్ వంతెన గత ఏడాదిన్నర క్రితం కురిసిన అతి భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి పక్కగ్రామాలు, గిరిజన తండాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తమ కష్టాలు తీరడం లేదని ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన మీదుగానే వాల్య తండా, కోటియా తండా, ఆజ్మీర తండాతో పాటు వివిధ గ్రామపంచాయతీల పరిధిలోని సుమారు పన్నెండు గిరిజన తండాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం వాగులో రోడ్డు పూర్తిగా కోతకు గురై రాళ్లు తేలిపోవడంతో నడవడానికే పరిస్థితి లేకుండా మారింది. ద్విచక్ర వాహనాలు వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏడాదిన్నరగా నిలిచిన రాకపోకలు
పాలేరు వాగుపై లెవెల్ వంతెన కొట్టుకుపోవడంతో ఏడాదిన్నరగా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరిపెడ మండల కేంద్రానికి వెళ్లాలంటే వాగు మీదుగా వెళ్లే మార్గం మూసుకుపోవడంతో ప్రజలు చుట్టూ తిరిగి సూర్యాపేట జిల్లా బికుమాల గ్రామం వద్ద మూడు వందల యాభై ఆరు జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీని వల్ల సమయం వృథా కావడంతో పాటు ఖర్చులు కూడా పెరిగాయని గిరిజన ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. అత్యవసర పనులు, వైద్యం, విద్య కోసం వెళ్లాలన్నా పెద్ద సమస్యగా మారిందని, వాగు అడ్డుగా మారి తమ జీవితాలనే నిలిపివేసిందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరవై కోట్ల బ్రిడ్జి టెండర్ రద్దు
గత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి మాజీ మంత్రి డీఎస్ రెడ్డి నాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కోతకు గురైన లెవెల్ వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సుమారు ఇరవై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయగా, టెండర్ ప్రక్రియలో ఒక కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు. అయితే చివరి నిమిషంలో నిధులు సరిపోవని కారణంతో అధికారులు టెండర్‌ను రద్దు చేశారు. లెవెల్ వంతెన మళ్లీ నిర్మిస్తే వరద నీరు ప్రవహించే అవకాశం ఉందని, అందువల్ల హై లెవెల్ బ్రిడ్జి అవసరమని అధికారులు సూచించారు. ఇందుకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజల ఆశలు అడియాసలయ్యాయి.
హై లెవెల్ వంతెన నిర్మించాలి
ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి పాలేరు వాగుపై హై లెవెల్ వంతెనకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని గిరిజన తండాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే మారుమూల గ్రామాల ప్రజలు గుర్తుకు వస్తారని, తర్వాత తమ కష్టాలను పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా వంతెన పరిస్థితి మారకపోవడం దురదృష్టకరమని, త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తిచేయకపోతే తమ జీవితం మరింత దుర్భరంగా మారుతుందని తండావాసులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఏడాది ఇదే దుస్థితి
దిగజర్ల భిక్షపతి, గ్రామం తానంచర్ల!
ప్రతి సంవత్సరం వర్షాలు కురిసి వాగు ఉధృతం గా ప్రవహిస్తున్నప్పుడల్లా రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లెవెల్ బ్రిడ్జి కావడంతో పైనుంచి వాగు ప్రవహిస్తుంది. విపరీతంగా రాళ్లు తేలి నడవలేని దుస్థితి నెలకొన్నది. అధికారులు స్పందించి లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని కోరుతున్నాను.

శాశ్వత పరిష్కారం చూపాలి!
ఓడపల్లి యాకయ్య, తానంచర్ల గ్రామం
ప్రతి సంవత్సరం కురిసే భారీ వర్షాలతో లో లెవెల్ వంతెన దెబ్బతింటున్నందున అధికారులు ప్రణాళిక బద్ధంగా శాశ్వత పరిష్కారం చూపి ప్రజల కష్టాలు తీర్చాలి. తాత్కాలిక పనులు చేపట్టడంతో ప్రభుత్వానికి డబ్బు వృధా తప్ప ప్రజల కష్టాలు ఎన్నటికి తీరవు.



