సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి
క్వార్టర్లు మాజీ కార్మికులకే కేటాయించాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని వినతి
కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు రూ.30 లక్షల వడ్డీ లేని గృహ రుణాలు అందించడంతో పాటు, సింగరేణి క్వార్టర్లను మాజీ కార్మికులకే కేటాయించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి *కిషన్ రెడ్డి*కి విజ్ఞప్తి చేశారు. మంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా ఆదివారం ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కూనంనేని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన మెమోరాండంను మంత్రికి అందజేశారు.
కొత్త గనులు, ఉపాధి అవకాశాలు
భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడిన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… సింగరేణి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు పెనగడప, పూనుకుడుచెలక, రాంపూర్, గుండాల ప్రాంతాల్లో తక్షణమే కొత్త భూగర్భ బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు తమ జీవితాన్ని గనులకే అంకితం చేశారని, వారి భవిష్యత్తు భద్రత కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు రూ.30 లక్షల వడ్డీ లేని గృహ రుణాలు అందించాలన్న డిమాండ్‌ను మంత్రికి వివరించినట్లు చెప్పారు. పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకుండా చెల్లించాలని కూనంనేని కోరారు. అలాగే పాత సింగరేణి క్వార్టర్లను కూల్చివేయకుండా, ప్రస్తుతం నివసిస్తున్న మాజీ కార్మికులకే వాటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికుల కార్పొరేట్ మెడికల్ బోర్డు సేవలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కొనసాగించాలని, వైద్య సదుపాయాల విషయంలో రాజీ పడరాదని మంత్రికి స్పష్టం చేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ బాధ్యత
సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే, కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మంత్రిని విన్నవించినట్లు చెప్పారు. ఈ భేటీలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, నాయకులు నెరేళ్ల రమేష్, పి. సత్యనారాయణచారి తదితరులు పాల్గొన్నారు.


