ఆర్థిక భారంతో హమాలి కూలి ఆత్మహత్య
అనాథలుగా భార్య, ఇద్దరు కుమార్తెలు
అనారోగ్యం–చికిత్సలతో పెరిగిన అప్పులు
మనస్తాపంతో కార్మికుడి బలవన్మరణం
చేర్యాలలో విషాద ఘటన
కాకతీయ, చేర్యాల : ఆర్థిక ఇబ్బందులతో హమాలి కూలి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని చుంచన్నకోట రోడ్డులో గల శివాలయం కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ పోషణ భారంతో పాటు అనారోగ్య చికిత్సల ఖర్చులు భరించలేకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం, వెలగల మురళి (33) గత కొన్ని సంవత్సరాలుగా హమాలి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోవడంతో ఆర్థిక భారం తీవ్రంగా పెరిగిందని చెప్పారు. చికిత్సల ఖర్చులు, జీవన వ్యయాలు కలసి మానసిక ఒత్తిడి పెరగడంతో అతడు ఈ అతి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కుటుంబంలో విషాద ఛాయలు
మృతుడికి భార్యతో పాటు చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబం దుఃఖసముద్రంలో మునిగిపోయింది. కాలనీ వాసులు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఆర్థిక, వైద్య సహాయం మరింత అవసరమని అభిప్రాయపడ్డారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టి, వాస్తవ కారణాలను నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు.


