ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి
ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయ టోర్నమెంట్ ప్రారంభం
తమిళనాడు–ఉత్తరప్రదేశ్ మధ్య హోరాహోరీ పోరు
మీరంతా మరో మిథాలీ రాజ్ కావాలి
కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్
కాకతీయ, ఖమ్మం : క్రీడా స్ఫూర్తితో ఆడుతూ ముందుకు సాగుతూ మీరంతా మరో మిథాలీ రాజ్ కావాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్. ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయస్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్‌ను ఆమె అభినందించారు. ఈ టోర్నమెంట్ ఖమ్మం గడ్డపై జరగడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆదివారం క్రీడాకారుల పరిచయ వేదిక అనంతరం టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించిన మిక్కిలినేని మంజుల నరేందర్ మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, ఓటమిని కూడా ఒక పాఠంగా తీసుకుని మరింత ముందుకు సాగాలని సూచించారు. క్రీడా రంగంలో క్రమశిక్షణ, పట్టుదల ఉంటే అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం సాధ్యమేనని అన్నారు.
క్రీడలకు ఖమ్మం ప్రత్యేక గుర్తింపు
ఖమ్మం జిల్లా ఉద్యమాలకు మాత్రమే కాకుండా కళాకారులు, క్రీడాకారులకు కూడా నిలయమని మంజుల నరేందర్ అన్నారు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఏడబ్ల్యుటి–20 సీఏ, ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కోచ్, నిర్వాహకులు మహమ్మద్ మతీన్ సారధ్యంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్ పోటీలు ఖమ్మం గడ్డపై నిర్వహించడం హర్షనీయమని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల నుంచి క్రీడాపై ఉన్న మక్కువతో క్రీడాకారులు ఇక్కడికి రావడం చిన్న విషయం కాదని, ఈ టోర్నమెంట్ వారిలోని ప్రతిభను వెలికితీయడానికి దోహదపడుతుందని అన్నారు.
జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి
ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని మంజుల నరేందర్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి సాధన చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటడం సాధ్యమని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు ముందుకొచ్చిన దాతలు, ముఖ్యంగా రాజస్థాన్ మార్బుల్స్‌తో పాటు ఇతర సహకార దాతలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. తొలుత జాతీయ గీతంతో టోర్నమెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. తమిళనాడు వర్సెస్ ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరప్రదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు తమిళనాడు జట్టుపై విజయం సాధించింది. ఈ పోటీలను నాలుగు కెమెరాలతో డీఎన్‌బీ న్యూస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు నాగుల్ మీరా, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్, మహిళా నాయకురాలు సుగుణ, రాజస్థాన్ మార్బుల్స్ అధినేత గుజ్జర్ బావర్‌జీ, ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ మహమ్మద్ మతీన్, ఆల్ ఇండియా టి–20 ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ సందీప్ ఆర్య, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు చోటేబాబా, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి పాల్గొన్నారు.
అలాగే అఫీషియల్ అంపైర్లు నైనా, ప్రియా, సంస్కృతి, సయ్యద్ పైసల్ అహ్మద్, సీనియర్ జర్నలిస్టు షేక్ జానీపాషా, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దగ్గుపాటి మాధవ్, ఖమ్మం జిల్లా కెమెరామెన్ సంఘం అధ్యక్ష–ప్రధాన కార్యదర్శులు ఫయాజ్, గణేష్, ఉపాధ్యక్షులు అర్షద్, కోశాధికారి యూసఫ్, పవన్, యాసిన్ తదితరులు హాజరయ్యారు.


