ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
ఓటు హక్కుపై యువతలో అవగాహనే లక్ష్యం
బీఎల్ఓల ముగ్గులు, విద్యార్థుల పోటీలు ఆకర్షణ
కాకతీయ, కొత్తగూడెం : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఐడీఓసీ ప్రాంగణంలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా రూపొందించిన ముగ్గులు అందరి మన్ననలు పొందాయన్నారు.
విద్యార్థులకు ప్రశంసలు, సన్మానాలు
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. చిన్న వయసులోనే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగగలరని ఆయన అన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న బూత్ లెవల్ అధికారులకు అవసరమైన కిట్లను కలెక్టర్ అందజేశారు.
ఉత్తమ అధికారులకు ఘన సత్కారం
ఎన్నికల విధుల్లో ప్రతిభ కనబరిచి ఉత్తమ ఎలక్టోరల్ అధికారులుగా ఎంపికైన తాసిల్దార్లు, జిల్లా మాస్టర్ ట్రైనర్‌లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యమేనని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
ఓటు హక్కుపై ప్రతిజ్ఞ
ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, విద్యార్థులు, నూతన ఓటర్లు సహా అందరితో ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహనను మరింత పెంచాయని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, తాసిల్దార్లు పుల్లయ్య, ధార ప్రసాద్, జిల్లా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు, నూతన ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.


