అవినీతికి చెక్ పెట్టేందుకే ‘వీబీజీ–రాంజీ’ చట్టం
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం
కాకతీయ, కరీంనగర్ : నూతన వీబీజీ–రాంజీ చట్టంతో కాంగ్రెస్ పాలకుల కమిషన్ల దందాకు కేంద్రం చెక్ పెట్టిందని, అందుకే ఆ పార్టీ నేతలు ఈ చట్టంపై విషప్రచారం చేస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనరసయ్య విమర్శించారు. సిరిసిల్లలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నూతన చట్టంపై నిర్వహించిన కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డిజిటల్ హాజరు, జియో ట్యాగింగ్ విధానాలతో కూలీల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే జమ అవుతుండటంతో మధ్యలో నొక్కేయడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. అందుకే కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దివాలాకోరు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. పనిదినాలను 125 రోజులకు పెంచడం, పని కల్పించలేకపోతే నష్టపరిహారం చెల్లించాలనే నిబంధన కూలీలకు వరప్రదానమని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లోనే వీబీజీ–రాంజీ చట్టం గొప్పతనాన్ని కూలీలకు వివరించి, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. మండల, జిల్లా కేంద్రాల్లో వివిధ వర్గాల ప్రజలతో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి శంకర్, మట్ట వెంకటేశ్వర రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి అన్నాడి జలపతి రెడ్డి, మండల అధ్యక్షులు, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


