తొర్రూరుపై ఎగిరేది గులాబీ జెండానే!
16 వార్డులూ మనవే : మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా
కాంగ్రెస్ నుంచి 50 మంది బీఆర్ఎస్‌లో చేరిక
కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం పట్టణంలోని 8వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లం అర్జున్ రాజు, అల్లం లక్ష్మీ, కొండపల్లి బిక్షపతి, కొండపల్లి వెంకటాచలం, రేబెల్లి లింగమల్లు, నిడిగోండ సుబ్రహ్మణ్యం, లక్ష్మణ్‌తో పాటు మొత్తం 50 మంది ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కేసీఆర్ హయాంలోనే తొర్రూరు అభివృద్ధి
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందంజలో ఉందంటే దానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. తొర్రూరు మండలాన్ని మున్సిపాలిటీగా మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు. మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గణనీయమైన అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని ఎర్రబెల్లి విమర్శించారు. ఈ విషయం ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్నారని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న 16 వార్డులలో 16 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, పెద్దవంగర మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


