ఇల్లందులో రోడ్డు భద్రత మహోత్సవాలు
అరైవ్..అలైవ్‌తో ప్రమాదాల నివారణే లక్ష్యం
హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
కాకతీయ, ఇల్లందు : రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఇల్లందు పట్టణంలో రోడ్డు భద్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అరైవ్..అలైవ్‌తో కార్యక్రమంలో భాగంగా ఇల్లందు బస్టాండ్ ప్రాంతంలో శనివారం ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరం కనకయ్య హాజరుకాగా, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై హసీనా, ఆర్టీసీ డిపో ఇన్‌చార్జి సునీత పాల్గొన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై రోడ్డు భద్రతపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. “ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం – రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం” అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీటుబెల్ట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు మాత్రమే కాకుండా ప్రాణనష్టం జరిగే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, లైన్ డిసిప్లిన్ పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
ప్రతి ఒక్కరి బాధ్యతే భద్రత
వాహనదారులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాహనదారులు, డ్రైవర్లు, ప్రజలతో రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అరైవ్..అలైవ్ అంటే ఇంటి నుంచి సురక్షితంగా బయలుదేరి, సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోవడమేనని అధికారులు స్పష్టం చేశారు.


