చొప్పదండిని బీజేపీకి అప్పగించండి
అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు
పట్టణాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం :
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని, పట్టణ రూపురేఖలనే మార్చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చొప్పదండి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. పట్టణాలు వెనుకబాటుకు గురవడానికి ఈ రెండు పార్టీల పాలనలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే నిర్వహిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వంతోనే పట్టణాల పురోగతి
2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఆ దిశగా అమృత్ పథకాలలో పట్టణాలను చేర్చడంతో పాటు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్మార్ట్ సిటీ హోదా కల్పించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందని, కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. పట్టణాల ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేసిన గంగాడి కృష్ణారెడ్డి.. కేంద్ర మంత్రుల సహకారం, కేంద్ర నిధులతో పట్టణాల అభివృద్ధి బాధ్యతను బీజేపీ స్వయంగా తీసుకుంటుందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలపై ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ప్రజలంతా బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్‌పై కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


