అభివృద్ధికే ప్రజలు ఓటెయ్యాలి
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో వేగం
దేశమంతా తెలంగాణ వైపు చూసేలా సమ్మక్క–సారక్క జాతర నిర్వహణ
మహిళా శక్తికే ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం!
మహబూబాబాద్‌లో వందల కోట్ల అభివృద్ధి
మారుతున్న నియోజకవర్గం రూపురేఖలు
మంత్రి వాకిటి శ్రీహరి
కేసముద్రాన్ని అభివృద్ధి చేస్తున్న వేం : మంత్రి పొన్నం
ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నవారే ఫ్రీ బస్ పథకంపై విమర్శలు : మంత్రి సీతక్క
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ప్రభుత్వానికి ఓటు వేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఆయన స్పష్టం చేశారు. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా సమ్మక్క–సారక్క జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇందుకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. గత పదేళ్లలో మహబూబాబాద్ జిల్లాకు రాని నిధులను వేం నరేందర్ రెడ్డి రెండేళ్లలోనే తీసుకువచ్చారని అభినందించారు. కేసముద్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా మహిళల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మహిళలకు అధికారం ఇస్తే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ చేశామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో పాటు పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, రాష్ట్ర ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రాన్ని అభివృద్ధి చేస్తున్న వేం : మంత్రి పొన్నం
కేసముద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వేం నరేందర్ రెడ్డి అభినందించి సత్కరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన ప్రాంతాల్లో మరో వెయ్యి ఇళ్లు అదనంగా మంజూరు చేశామని తెలిపారు. ఉచితంగా ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించిందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తున్నామని వివరించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, మిగిలిన హామీలను రాబోయే రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేసముద్రం బస్ స్టేషన్ భూమి కోర్టు కేసుల్లో ఉండటాన్ని పరిష్కరించి శంకుస్థాపన చేశామని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల మెరుగుదలకు ప్రత్యేక పథకాలు అమలు అవుతున్నాయని, గత ప్రభుత్వం అమలు చేసిన మంచి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. గీతా వృత్తిదారులకు కాటమయ్య రక్షణ కవచాలు అందిస్తున్నామని తెలిపారు.
ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నవారే ఫ్రీ బస్ పథకంపై విమర్శలు : మంత్రి సీతక్క
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ స్ఫూర్తితో మహిళలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నవారు ఫ్రీ బస్ పథకంపై కుట్రపూరిత కథనాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం 68 లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పావలా వడ్డీ పేరుతో, వైఎస్ఆర్ అభయహస్తం కింద ఉన్న రూ.1,800 కోట్లను వినియోగించుకుందని ఆరోపించారు. గత రెండేళ్లలో రూ.40 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా షాపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లులు, ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకే అప్పగిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మహిళా సంఘాల ద్వారా ముందస్తుగా లక్ష రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు అందిస్తున్నామని, గత రెండేళ్లలో 410 కుటుంబాలకు రూ.41 కోట్లు అందించామని తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారిని కూడా మహిళా సంఘాల్లో కొనసాగిస్తున్నామని, త్వరలో రూ.1,200 కోట్ల వడ్డీ డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పారు. మహిళలకు పెండింగ్‌లో ఉన్న 2,500 హామీలను రాబోయే రోజుల్లో నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. కేసముద్రం మహిళా సంఘాలకు రెండు బస్సులు ఇస్తున్నామని, వేం నరేందర్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. మూడు నెలల్లోనే చిత్తశుద్ధితో మేడారం ఆలయాలను అభివృద్ధి చేశామని, ఆడబిడ్డలు ఎదగాలని ఆకాంక్షించారు.



