బాలల చేతిలో బ్యాలెట్..!
మాక్ పోలింగ్‌తో విద్యార్థుల్లో ఎన్నికల జోష్
ఓటింగ్ ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన
కాకతీయ, కూసుమంచి : పిల్లలకు ఓటు హక్కు ఎప్పుడొచ్చింది అని అనుకునేలా కూసుమంచి మండల కేంద్రంలో శనివారం మాక్ పోలింగ్ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గ్లోబల్ రెయిన్ బో పాఠశాల, *జేవీఆర్ కళాశాల*ల్లో నమూనా ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులంతా ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఓటింగ్ విధానం, కౌంటింగ్ ప్రక్రియలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.

నిజమైన ఎన్నికల మాదిరిగానే…
మాక్ పోలింగ్‌ను పూర్తిగా అసలైన ఎన్నికల తరహాలోనే నిర్వహించారు. ఓటర్ లిస్ట్ ప్రకటించడం, తరగతి–సెక్షన్‌ల వారీగా బ్యాలెట్ పేపర్లు ముద్రించడం, పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారులుగా విద్యార్థులే బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, రెండు రోజుల ప్రచారం అనంతరం గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ అధికారులుగా విద్యార్థులు విధులు నిర్వర్తించారు. మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.
నాయకత్వ లక్షణాలకు బీజం
ఈ మాక్ పోలింగ్‌లో స్కూల్ లీడర్‌గా సీహెచ్ యశ్వంత్, గర్ల్స్ రిప్రజెంటేటివ్‌గా వై హర్షిత శ్రీ అనురాధ విజయం సాధించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాడెంట్ ఎర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ.. ఓటు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, భవిష్యత్తులో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించడమే మాక్ పోలింగ్ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఇన్‌చార్జీలు పాపారావు, జాహ్నవి, నాజియా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఆరిఫ్ అలీతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


