సిట్టింగ్‌కు ఫిట్టింగ్
గండ్ర సత్యనారాయణకు మునిసిపల్ ఎన్నికల సవాల్!
భూపాలపల్లిలో వేడెక్కిన రాజకీయం
చైర్మన్ పీఠం ఈసారి బీసీ జనరల్‌కు రిజర్వ్
30 వార్డుల్లో 50 శాతం సీట్లు మహిళలకే
రిజర్వేషన్ల తారుమారుతో ఆశావహులకు దక్కని అవకాశం
భార్యలను పోటీకి దింపేందుకు నేతల ప్రయత్నాలు
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తలమునకలు
గెలుపు గుర్రాల వేటలో అధికార, ప్రతిపక్షం
అంగ, అర్థబలం ఉన్నోళ్లకే అవకాశం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిష్ఠాత్మకంగా గండ్ర వర్సెస్ గండ్ర పోరు
కాకతీయ, వరంగల్ బ్యూరో : పురపాలక సంఘాల రిజర్వేషన్లు తేలడంతో ఆశావహుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఇప్పటికే కొందరు వార్డుల బాటపట్టారు. మరికొందరు ఏ వార్డైతే మేలన్న అంతర్మథనంలో పడ్డారు. ఓటర్లు తమకు అనువుగా ఉన్నారా లేదా అన్న వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియకు ముందు ఫలానా వార్డు రిజర్వేషన్ అనుకూలిస్తే తప్పకుండా పోటీ చేయాలని భావించారు. కానీ రిజర్వేషన్లు మారిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఆయా పార్టీల నేతలు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహం మార్చారు. కొన్నిచోట్ల పతుల స్థానం రాకపోయే సరికి సతులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అభ్యర్థుల వేటలో పడ్డారు. గెలుపు గుర్రాలపై నేతలు దృష్టి సారించారు. అభ్యర్థులు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆయా వార్డుల్లో అభిప్రాయ సేకరణ ప్రారంభించారు.

చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు
భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 30 వార్డులకుగాను 50శాతం సీట్లను ఈసారి మహిళలకు కేటాయించారు. మరోపక్క రిజర్వేషన్లు అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లాయి. అప్పటి వరకు ఎన్నికల బరిలో ఉంటామని భావించిన పలు రాజకీయ పార్టీల నేతలు రిజర్వేషన్లు అనుకూలించక పోవడంతో వారి భార్యలను పోటీకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల నాయకులు వారికి నమ్మకస్తులైన మహిళా అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రజల్లో పలుకుబడి, నమ్మకం, ఆర్థికంగా ఉన్నవారిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భావిస్తున్నాయి. గడిచిన రెండు పర్యాయాలు భూపాలపల్లి పురపాలక సంఘం చైర్‌పర్సన్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకే దక్కింది. ఈసారి బీసీ జనరల్‌కు కేటాయించడంతో ప్రధాన పార్టీల నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోటీలో దించడానికి అంగ, ఆర్థిక బలం గల బీసీ జనరల్ అభ్యర్థి కోసం ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. దశాబ్దం తర్వాత అవకాశం దక్కడంతో బీసీ సామాజిక వర్గం నేతలు చైర్మన్ పీఠంపై కన్నేసి తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
గండ్ర వర్సెస్ గండ్ర
భూపాలపల్లి మున్సిపాలిటీపై ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రణాళికలు రచిస్తుండగా.. మరోమారు మున్పిపాలిటీని కైవసం చేసుకొని అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు వేర్వేరుగా రెండు ప్రధాన పార్టీల ముఖ్య నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల గురించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేత పురపాలక సంఘంలోని 30 వార్డులకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించి ఆయా వార్డుల్లో ఆదరణ ఉన్న అభ్యర్థులను గుర్తించాలని సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకులు కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనేపథ్యంలోనే బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతుండడంతో మున్సిపల్ ఎన్నికల కోలాహలం పట్టణంలో స్పష్టంగా కనిపిస్తోంది.
సత్యనారాయణకు సవాల్
భూపాలపల్లి పురపాలక సంఘం ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ప్రతిష్టాత్మకంగా మారాయి. నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఎన్నికలవడం.. పట్టణ ఓటర్ల మద్దతు కూడగట్టడం సత్తెన్నకు సవాల్‌గా మారింది. ఎలాగైనా ఈసారి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర గట్టి పట్టుదలతో ముందుకుసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల వ్యవధిలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార భావిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, సన్న బియ్యం, రైతు భరోసా వంటి పథకాలతోపాటు పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.


