అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు
హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చరిక
కోహెడలో సివిల్–ఎక్సైజ్ సంయుక్త దాడులు
13 లీటర్లకు పైగా మద్యం, బీరు స్వాధీనం
కాకతీయ, కోహెడ : అనధికారంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో శనివారం సివిల్, ఎక్సైజ్ పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పలువురిని గుర్తించి చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 7.2 లీటర్ల మద్యం, 5.85 లీటర్ల బీరు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ పవన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనుమతి లేకుండా మద్యం విక్రయించడం నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో హుస్నాబాద్ ఎక్సైజ్ ఎస్సై దామోదర్, కోహెడ ఏఎస్సై కనకయ్యతో పాటు ఎక్సైజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం విక్రయాలపై ప్రజలు సమాచారం అందించాలని అధికారులు కోరారు.


