మట్టి రవాణాపై ప్రశ్నించినందుకు దాడి
వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ సర్పంచ్ భర్తపై కాంగ్రెస్ నేతల దాడి!
పిడిగుద్దులు, హెల్మెట్‌తో ఇష్టానుసారంగా మూకుమ్మడిగా అటాక్
కాకతీయ, వర్ధన్నపేట : వర్ధన్నపేట నియోజకవర్గంలో అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్న సర్పంచ్ భర్తపై దాడి జరగడం కలకలం రేపింది. నల్లబెల్లి గ్రామంలో మట్టి అక్రమ రవాణాను ప్రశ్నించిన సర్పంచ్ భర్త *శ్రీకాంత్*పై స్థానిక కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం, నల్లబెల్లి పరిధిలో జరుగుతున్న అక్రమ మట్టి రవాణాను శ్రీకాంత్ అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు అతడిపై పిడిగుద్దులతో పాటు హెల్మెట్‌తో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలను అడ్డుకున్నందుకే దాడికి పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ రవాణాపై ప్రశ్నించినందుకే..?!
గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలింపు జరుగుతోందని, దీనిపై గత కొంతకాలంగా ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ భర్తగా శ్రీకాంత్ గ్రామ ప్రయోజనాల కోసం అక్రమ రవాణాను అడ్డుకున్నారని తెలిపారు. అయితే దీనికి ప్రతీకారంగా దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత పెరిగింది. అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
దాడి ఘటనపై పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపైనే దాడులు జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


