ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు సజ్జనార్ లీగల్ నోటీసులు
అవాస్తవ ఆరోపణలపై వివరణ కోరిన సిట్ చీఫ్
పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై అభ్యంతరం
ఏడు కేసుల వివరాలు ఇవ్వాలని డిమాండ్
రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని గడువు
లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవంటూ హెచ్చరిక
కాకతీయ, హైదరాబాద్ : మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత *ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్*కు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధిపతి వి.సి. సజ్జనార్ తెలిపారు. తనపై ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ, వాటిపై రెండు రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ప్రవీణ్ కుమార్ ఇటీవల మీడియా సమావేశంలో సజ్జనార్‌పై గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అలాంటి వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే అర్హత లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేవిగా ఉన్నాయని సజ్జనార్ నోటీసుల్లో పేర్కొన్నారు.
కేసుల వివరాలు ఇవ్వాలని డిమాండ్
తనపై ఉన్నాయని చెబుతున్న ఏడు కేసులకు సంబంధించి క్రైమ్ నంబర్లు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లు, వర్తించే సెక్షన్లు తదితర పూర్తి వివరాలతో పాటు డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని సజ్జనార్ డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది చట్టపరంగా నేరమని ఆయన స్పష్టం చేశారు. నోటీసు అందిన రెండు రోజుల్లోగా సరైన ఆధారాలతో వివరణ ఇవ్వకపోతే, తనకు ఉన్న చట్టబద్ధ హక్కులను వినియోగించుకుని సివిల్‌తో పాటు క్రిమినల్ చర్యలు (పరువు నష్టం కేసులు సహా) తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. అంతేకాదు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు.
రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ నేపథ్యం ఉన్న ఇద్దరు నేతల మధ్య నోటీసుల వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు మరింత ఆసక్తికరంగా మారాయి. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారమే సాగుతోందని సజ్జనార్ స్పష్టం చేస్తూ, తప్పుడు ఆరోపణలతో దర్యాప్తును మళ్లించేందుకు చేసే ప్రయత్నాలను సహించబోమని సంకేతాలు ఇచ్చారు.


