అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
స్వచ్ఛ సర్వేక్షన్‌లో టాప్ ర్యాంక్ లక్ష్యం
వివిధ స్కీముల పనులపై కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సమీక్ష
కాకతీయ, కరీంనగర్ కార్పొరేషన్ : నగరపాలక సంస్థ పరిధిలో వివిధ స్కీములు, గ్రాంట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగం సమీక్షా సమావేశంలో 15వ ఆర్థిక సంఘం, స్వచ్ఛ భారత్ మిషన్, సబ్‌ప్లాన్, ఎంపీ ల్యాడ్స్ తదితర గ్రాంట్లతో చేపట్టిన పనుల పురోగతిని ఆయన సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, పూర్తైన పనుల బిల్లులు వెంటనే సమర్పించాలని సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఆలస్యం జరిగితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్–2025–26లో నగరానికి ఉత్తమ ర్యాంక్ సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని కమిషనర్ పిలుపునిచ్చారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడం నిషేధమని స్పష్టం చేస్తూ, సిటిజన్ బడ్డి యాప్ లేదా మున్సిపాలిటీ ద్వారా బుకింగ్ చేసి రీసైక్లింగ్‌కు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్, సానిటేషన్, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


