ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర
ఖమ్మం మార్కెట్లో రైతుల ఆందోళన
ఖరీదుదారుల మోసంపై రైతుల ఆగ్రహం
మార్కెట్ కార్యాలయం ముట్టడి.. ఉద్రిక్తత
చైర్మన్ హామీతో ఆందోళన విరమణ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు అకస్మాత్తుగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఖరీదుదారులు ఉద్దేశపూర్వకంగా ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తూ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నా చేపట్టారు. శుక్రవారం మార్కెట్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల వాదన ప్రకారం, ఏసీ మిర్చి ధర రూ.20,100 వరకు పెరిగినప్పటికీ ఖరీదుదారులు మాత్రం రూ.13 వేల నుంచి రూ.15 వేల మధ్యే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మార్కెట్ అధికారులను నిలదీయగా, వారి వివరణకు రైతులు సంతృప్తి చెందలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
ఖరీదుదారులపై తీవ్ర ఆరోపణలు
రాష్ట్రంలో ఎక్కడలేని ధర ఖమ్మం మార్కెట్లో ఉంటుందనే ఆశతో పండించిన మిర్చిని తీసుకొస్తే, ఖరీదుదారులు తమ ఆశలపై నీళ్లు చల్లుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు కృత్రిమంగా తగ్గిస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. సుమారు రెండు గంటల పాటు కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ కార్యకలాపాలు స్థంభించాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ యర్రగర్ల హనుమంతరావు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అనంతరం ఖరీదుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని వారికి హితవు పలికారు. జెండా పాట నిబంధనల ప్రకారమే మిర్చి కొనుగోలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఖరీదుదారులు రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ స్పష్టం చేశారు. ఆయన హామీతో రైతులు ఆందోళన విరమించగా, మార్కెట్‌లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.


