అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ఇప్పటివరకు 3,836 కార్యక్రమాల నిర్వహణ
డీజీపీ శివధర్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్నాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సెలవు రోజులు మినహాయించి దాదాపు పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతను సామూహిక ఉద్యమంగా మార్చడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
ఈ అవగాహన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నెల 20న నిర్మల్ జిల్లాలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాల సంఖ్య 3,836కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి పౌరుడిలో రోడ్డు భద్రత పట్ల బాధ్యతాభావం పెంపొందించడం, ప్రమాదాలకు దారితీసే నిర్లక్ష్యపు ప్రవర్తనను తగ్గించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని బలోపేతం చేయడం ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేస్తూ సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ వినియోగం, సీటుబెల్ట్ ధరించడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం నివారణ, మద్యం సేవించి డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటో ఓవర్‌లోడింగ్, హైబీమ్ లైట్ల దుర్వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామం నుంచి జిల్లా వరకు సమన్వయం
జిల్లా స్థాయిలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. డివిజన్ స్థాయిలో ఎస్డీపీఓలు, మండల స్థాయిలో సీఐలు, ఎస్సైలు, గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ ట్రాఫిక్ సేఫ్టీ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎన్‌సీసీ ప్రతినిధులు, యువత, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ యజమానులు తదితరులను ఉద్యమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. గ్రామ సభలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మత సంస్థలు, స్వయం సహాయక సంఘాలతో కలిసి విస్తృత ప్రచారం కొనసాగుతోంది. ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి, తెలంగాణను దేశానికి ఆదర్శ రోడ్డు భద్రతా రాష్ట్రంగా నిలబెట్టే దిశగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


