వచ్చే సారికి చూద్దాం..!
ఈ సీజన్ కు తాత్కాలికంగా వసతులు చేపట్టండి
ముసలమ్మకుంట పండ్ల మార్కెట్ పై ఆర్ జేడీఎం సూచనలు
మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన ఆర్.లక్ష్మణుడు
అధికారులకు పలు సూచనలు, సలహాలు
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట పండ్ల మార్కెట్ లో తాత్కాలికంగా వసతులు ఏర్పాటు చేయాలని ఆర్ జేడీఎం ఆర్.లక్ష్మణుడు అధికారులకు సూచించారు. మామిడి సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోందని, ఈ తరుణంలో శాశ్వత ఏర్పాట్లు అసాధ్యమని పేర్కొన్నారు. వచ్చేసారికి పూర్తిస్థాయిలో వసతుల కల్పనకు చర్యలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. శు క్రవారం ఆయన ముసలమ్మకుంట పండ్ల మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ యార్డులో చెత్తాచెదారాన్ని చూసి అవాక్కయ్యారు. ఇప్పటికిప్పుడు శాశ్వత ఏర్పాట్లు చేయడం వీలుపడదని పేర్కొన్నారు. వెంటనే చెత్తాచెదారం, ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. త్రాగు నీటి వసతి, రైతులకు తాత్కాలిక నీడ కోసం ఏర్పాట్లు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, ఇతరత్రా సౌకర్యాలు తక్షణమే చేపట్టేందుకు నిధుల అంచనాలు సిద్ధం చేసి నివేదించాలని సూచించారు. అంతకు ముందు ఆర్ జెడిఎం కార్యాలయం నుంచి వరంగల్ రీజినల్ పరిధిలోని మార్కెట్ కార్యదర్శులు, జిల్లా మార్కెట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయొద్దని సూచించారు. మార్కెట్ లో రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని చెప్పారు.


