జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ
మునిగిపోతున్న ముగ్గురిని రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్నవాగులో జరిగిన ప్రమాదంలో మునిగిపోతున్న ముగ్గురిని రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) 5వ బెటాలియన్ సిబ్బంది, తెలంగాణ ప్రత్యేక పోలీస్ బలగాలు రక్షించాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భూపాలపల్లి జిల్లాకు చెందిన మేకల జంపయ్య (36), మేకల సరిత (14), మేకల శిరీష (13) అకస్మాత్తుగా లోతైన నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ దృశ్యాన్ని గమనించిన విధుల్లో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కానిస్టేబుళ్లు రాందాస్, ప్రవీణ్, రాజశేఖర్, రవి, రాజు, హరీష్ ఎలాంటి ఆలస్యం చేయకుండా నీటిలోకి దిగి మునిగిపోతున్న ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారి ధైర్యం, సమయోచిత నిర్ణయంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ 5వ బెటాలియన్ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మేడారం జాతర వంటి మహా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రజలకు సహాయం అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి భక్తులను కాపాడిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రక్షించబడిన వారి కుటుంబ సభ్యులు ఎస్‌డీఆర్‌ఎఫ్ రక్షక బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు.


