ఆ కథనం అసత్యం
కొమ్మాల ఆలయంలో అవకతవకల్లేవు
నిబంధనల ప్రకారమే వేతనాలు, ఖర్చులు
ఓ పత్రికలో కథనం రావడంతో ధర్మకర్త స్పష్టీకరణ
కాకతీయ, గీసుగొండ: కొమ్మాల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవని దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు స్పష్టం చేశారు. ఆలయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఓ పత్రికలో అసత్య కథనం ప్రచురించారని పేర్కొన్నారు.
దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెలా చెక్కు ద్వారానే వేతనాలు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి బకాయిలు లేవని తెలిపారు. నిత్య నివేదనల కోసం అర్చకులు కాండూరి రామాచార్యులకు నెలకు రూ.10 వేల చొప్పున చెక్కు ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని వివరించారు. పూల బిల్లులు, కరెంట్ బిల్లులు తదితర ఖర్చులన్నీ బిల్లుల ఆధారంగానే చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. వేతనాలు బకాయిలు ఉన్నట్లు ప్రచురితమైన సమాచారం వాస్తవ విరుద్ధమని, ఇలాంటి వార్తలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయంలో జరిగే వివాహాలన్నీ చట్టప్రకారంగానే నిర్వహిస్తున్నామని ధర్మకర్త తెలిపారు. ప్రేమ వివాహాలు జరగకుండా అర్చకుల అంగీకారంతో వాటిని నిలిపివేసినట్లు చెప్పారు. కార్తీక మాస పవిత్రోత్సవాలు అర్చకుల సెలవులు, అనారోగ్య కారణాలతో ఆలస్యం కాగా, మాఘ మాసంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత అర్చకులకు మెమో జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ అద్దంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిధుల వినియోగం జరుగుతుందని, ప్రతి లావాదేవీకి ఆడిట్ ఉంటుందని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఆధారంగా వార్తలు ప్రచురించవద్దని కోరారు.


