శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం
శతాబ్ది ముగింపు సభతో శ్రేణుల్లో కొత్త ఉత్తేజం
మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు
ఉపాధి హామీ రక్షణకు క్షేత్రస్థాయి ఆందోళనలు
ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు
కాకతీయ, ఖమ్మం : సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు పార్టీ శ్రేణుల్లో గొప్ప పోరాట స్ఫూర్తిని నింపాయని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలకు పునరంకితం కావాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. దేశం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక గిరిప్రసాద్ భవన్‌లో తోట రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో హేమంతరావు మాట్లాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 18న జరిగిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో అపూర్వ ఉత్సాహాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆ సందర్భంగా జాతీయ స్థాయి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాల అమలుకు పార్టీ పూనుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఉపాధి హామీ కోసం పోరాటాలు
వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేందుకు క్షేత్రస్థాయి నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హేమంతరావు తెలిపారు. కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని హేమంతరావు వెల్లడించారు. మున్సిపాలిటీలలో తమ బలాబలాలను బట్టి పోటీ ఉంటుందని, సిపిఐ అభ్యర్థిత్వాలపై ఇప్పటికే సమావేశాలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు తమను సంప్రదిస్తున్నాయని, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పార్టీ యంత్రాంగమంతా సమ్మె ప్రచారంలో పాల్గొనాలని ఆయన సూచించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పాలన సాగుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపులో జరిగిన బహిరంగ సభ, ప్రదర్శనలతో పాటు తదనంతర కార్యక్రమాలను జయప్రదం చేసిన నాయకులు, కార్యకర్తలకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది.


