పల్లాకు ప్రతిష్టాత్మకం?
జనగామ పుర పోరులో గెలుపెవరిది ?
అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ
వ్యూహాలకు పదునుపెడుతున్న ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి
ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన ప్రధాన పార్టీలు
ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులు
టికెట్ దక్కించుకునేందుకు ఆశావహుల పాట్లు
చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయింపు
కాకతీయ, వరంగల్ బ్యూరో: జనగామ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావడం.. జిల్లా కేంద్రంలో జరిగే ఎన్నికలవడంతో రాజేశ్వర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనూహ్యంగా మెజార్టీ సీట్లు దక్కించుకుంది. అదే ఊపుతో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్న గట్టి పట్టుదలతో నేతలు ముందుకు సాగుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జనగామ మున్సిపాలిటీని చేయి జార్చుకోవద్దని నేతలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు దృష్టి సారించారు. బీజేపీతోపాటు స్వతంత్రులు రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుండటంతో జనగామ పట్టణంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. 30 వార్డులున్న జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ !
జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ పురపాలికలను ఎలాగైనా దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా అదే పట్టుదలతో కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. దీంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈక్రమంలోనే అంగ అర్థ బలం ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు రెండు పార్టీలు వార్డు స్థాయిలో విస్తృత కసరత్తు ప్రారంభించాయి. ఆశావాహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించి వార్డుల వారీగా బేరీజీ వేసుకుంటూ గెలుపు గుర్రాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్కో వార్డులో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపడంతో టికెట్ల కేటాయింపు ఆయా పార్టీల నేతలకు తలనొప్పిగా మారాయి. టికెట్ దక్కని వారితో నష్టం జరగకుండా వారిని బుజ్జగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నారు. నేడోరేపో షెడ్యూల్ రిలీజ్ కానుండగా అభ్యర్థుల వేటలో నేతలు తలమునకలయ్యారు.
పకడ్బందీగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో స్క్రీనింగ్ కమిటీలను నియమించారు. ఎన్నికల వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా కమిటీలు కీలక భూమిక పోషించనున్నాయి. సంబంధిత ఇంచార్జ్ మంత్రి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. డీసీసీ అధ్యక్షులు కన్వీనర్‌గా, పార్లమెంటు పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నేతలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను ఈ కమిటీలే నిర్ణయించనున్నాయి. జనగామ మున్సిపాలిటీ ఇన్‌చార్జి మంత్రి సీతక్క చైర్మన్‌గా , డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి కన్వీనర్‌గా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, టీ పీసీసీ మెంబర్ లక్ష్మీనారాయణ నాయక్‌తో పాటు కీలక నాయకులు ఈ స్క్రీనింగ్ కమిటీలో భాగస్వాములు కానున్నారు.
అధికార పార్టీ నుంచి పోటీకి ఉత్సాహం
జనగామలో మొత్తం 30 వార్డులకుగాను చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో పెద్దఎత్తున ఆశావాహులు అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ఖరారుకు సంబంధించి ప్రక్రియ మొదలుకానుంది. పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థుల వివరాలను సేకరిస్తూనే ఇంటలిజెన్స్ రిపోర్టులు, స్థానిక రాజకీయ సమీకరణాలు పరిశీలించిన తర్వాతే గెలుపు గుర్రాలను తుది జాబితాలో ఎంపిక చేయనున్నారు.
గెలపుపై బీఆర్ఎస్ ధీమా..
జనగామ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉందని.. రానున్న ఎన్నికల్లో గెలుపు తథ్యమని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో సత్తాచాటామని, కాంగ్రెస్‌ను రెండో స్థానంలోకి నెట్టామని అంటున్నారు. జిల్లాలో 60 శాతం సర్పంచి సీట్లు, 70 శాతం వార్డు స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుందని, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తన సొంతూరిలో వారం రోజులు తిష్ట వేసి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి బెదిరించినా నర్సాయపల్లి, అత్తగారి ఊరి గంగాపురంలో ఓటమి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపించుకోలేక పోయారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈక్రమంలోనే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి చైర్మన్ పీఠం దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు


