పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’
సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు
ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు
ఆరు మండలాలకు రూ.3.05 కోట్ల చెక్కుల పంపిణీ
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్ : ప్రజా ప్రభుత్వ పాలనలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి స్పష్టం చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా చేయడమే లక్ష్యంగా ‘కళ్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ క్లబ్‌లో ఆరు మండలాలకు చెందిన 305 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల 5 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాధవ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తోందని, ఆర్థిక భారమున్నా సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా జాప్యం లేదని తెలిపారు.
ప్రభుత్వం అండగా నిలుస్తుంది
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎవరూ దళారులను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించి కుటుంబాలపై భారం తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమానంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, వివిధ మండలాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


