చేర్యాలలో గులాబీ జోరు
బీఆర్‌ఎస్‌లోకి వీరబత్తిని సదానందం
ఎమ్మెల్యే పల్లా సమక్షంలో చేరిక
కేసీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్‌కు వణుకు : ఎమ్మెల్యే పల్లా
కాకతీయ, చేర్యాల : సిద్ధిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన వీరబత్తిని సదానందం శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆయన చేర్యాలలో పలువురు నేతలతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. చేర్యాల, జనగామ మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగిపోయారని ఎమ్మెల్యే పల్లా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సకలజనం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఆయన పేరు వింటేనే కాంగ్రెస్ నాయకులకు వణుకు పుడుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయమని ఎమ్మెల్యే పల్లా ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరిన వీరబత్తిని సదానందంను ఆయన అభినందించారు.


