రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్
పాఠశాల సమయంలో చేయొద్దని డీఈవో చెప్పినా వినలేదు
రీల్స్‌లో ప్రైవేటు పాఠశాలల ప్రమోషన్లు చేయడంపై కఠిన చర్య
ఖమ్మం డీఈవో కార్యాలయంలో విధులపై నిర్లక్ష్యం వహించిన ఇద్దరికి మెమోలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విధులపై నిర్లక్ష్యం వహించడంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేస్తూ, పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసిన స్కూల్ అసిస్టెంట్ బానోత్ గౌతమిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని ఉత్తర్వులు జారీ చేశారు. బానోత్ గౌతమి గత కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ విధి సమయాన్ని వృథా చేస్తున్న అంశంపై ఉన్నతాధికారులు గతంలో పలుమార్లు హెచ్చరించినా ఆమె తన తీరు మార్చుకోలేదని డీఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉపేక్ష లేకుండా సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే అంకితమవ్వాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. ఇదే సమయంలో డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు కార్యాలయ సమయాన్ని పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లినందుకు, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ ‘డీఈవో టేబుల్‌పై ఉన్నాయి’ అంటూ అబద్ధాలు చెప్పినందుకు మెమోలు ఇచ్చినట్లు డీఈవో తెలిపారు. కార్యాలయ సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, అంకితభావంతో పని చేసి ఫైల్స్‌ను సకాలంలో సమర్పించాలని సూచించారు. లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


