మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన ఘటన
భక్తుడికి గాయాలు… ఆసుపత్రికి తరలింపు
విషయం బయటకు రాకుండా మంత్రాంగం?
కాకతీయ, మేడారం : మేడారంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. జాతర ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ నేమ్‌బోర్డు ఒక్కసారిగా కిందపడటంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక భక్తుడు గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని జాతరలో చర్చ సాగుతోంది. జంపన్నవాగు నుంచి గద్దెలకు వెళ్లే ప్రధాన రహదారిలోని హరిత వై–జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న భయాందోళన భక్తుల్లో వ్యక్తమవుతోంది. లైటింగ్ నేమ్‌బోర్డు కుప్పకూలిన ఘటనపై అధికారుల మధ్య సమన్వయం లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిన అధికారులు, విషయం బయటకు పోకుండా ఉంచేందుకు తంటాలు పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే వీడియోలు తీయవద్దంటూ మీడియాను కాంట్రాక్టర్లు అభ్యర్థించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతర నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికార యంత్రాంగం మంత్రాంగం నడుపుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

భక్తుడికి గాయాలు… పోలీసుల తీరుపై ఆగ్రహం
ఈ ఘటనలో గాయపడిన ఎడ్ల నర్సయ్య పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైటింగ్ హోర్డింగ్ కుప్పకూలడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. హోర్డింగ్ కింద ఇరుక్కున్న తనను అక్కడే ఉన్న పోలీసులు కాపాడలేదని, తన భార్య ఎంత బ్రతిమలాడినా వారు కనికరం చూపలేదని వాపోయారు. తనను బయటకు తీసేందుకు పోలీసులు కాకుండా, అక్కడున్న సుమారు 20 మంది భక్తులే ముందుకొచ్చారని ఆయన తెలిపారు. ప్రమాద సమయంలో పోలీసులు మానవత్వంతో వ్యవహరించలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. లైటింగ్ నేమ్‌బోర్డులు ప్రభుత్వానివా? ప్రైవేట్‌వా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అవి ప్రైవేట్‌వైతే భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని, భక్తుల ప్రాణాలకు బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు భక్తుల భద్రత కోసమే జాతరలో ఉంటారా? లేక కేవలం విధులకు పరిమితమా? అంటూ క్షతగాత్రుడు ప్రశ్నించారు. లైటింగ్ నేమ్‌బోర్డు కుప్పకూలడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


